శ్రీ జగజ్జననీ ఆలయ నిర్మాణ విశేషాలు

'సంకల్పోహి జనానాం చిత్త సమ్యక్కరణసాధనం, తదన్యత్ర ఫలాఫలాని దైవేైన నిశ్చయితవ్యం'' - ఇతి ప్రాజ్ఞా ఊచు. అని ప్రాచీన వార్తికం. మనిషి ఒక 'రోబోట్' లాంటి వాడు. రిమోట్ కంట్రోల్తో దానిని నడిపించే సాంకేతిక మేధావి ఆ పరమాత్మ. ఆయన తన ఇష్ట ప్రకారము మనిషిని నడుపుతుంటాడు.

మనిషిపనల్లా తన జన్మ యెందుకోసమో కాస్తయినా గ్రహించి తన ధర్మపథంలో తాను నడుస్తోండడం, అలా నడుస్తూ పోతుంటే తన కిష్టమైన పద్ధతిలో నడిపేవాడు ఆ పరమాత్మ.

పుణ్యమూర్తి శివనాగపుల్లయ్య అలాంటి ఓ సాధారణ మనిషి. తానెందుకీ మానవ జన్మనెత్తాడో ఆలోచన లేని వ్యక్తి. దైవం నడిపినట్లు నడిచే యాంత్రికపాణి అలా భగవన్నిర్ణయంగా 1983లో భవాని దీక్షలో ఉన్నప్పుడు అహోబిలం వెళ్ళడం - అక్కడ ఎగువ అహోబిళంలో అత్యంత తేజస్సంపన్నులైన యోగుల బృందం జగజ్జననీ మూర్తి వున్న చిత్రాన్ని శివనాగపుల్లయ్య చేతికిచ్చి ''ఇది హిమాలయాల్లో వుండేదని మా గురువులు చెప్పేవారు. నిన్ను చూడగానే ఈ అమ్మవారికి ఆలయ నిర్మాణ ప్రేరణ నీలోనే కలిగించాలనేది ఆ తల్లి సంకల్పం. అమ్మకు ఆలయం కట్టు. కట్టుతావు. ఇక నీకన్నీ జయాలే'' అన్నారు.

ఆశ్చర్య సంభ్రమం నుండి పుల్లయ్య తేరుకోనే లోగానే వాళ్ళు అవుపించలేదు. అదీ సంకల్పం. అది కలిగించిందా పరాశక్తి. ఫోటో పుల్లయ్య చేతిలో వుంది.

తర్వాత పుష్కర కాలానికి గానీ మళ్ళీ ఆలయ నిర్మాణ సంకల్పం శివనాగపుల్లయ్యకు కలుగలేదు. అంటే 1996లో అమ్మవారి ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పట్టణం ఈశాన్యంలో లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు.

ఈ సంకల్పానికి వూతమిచ్చింది యువసైన్యమే. 1988లోనే భవానీ దీక్షో పాల్గొనే మిత్రబృందం అందరూ కలిసి ''శ్రీ దుర్గ ఫ్రెండ్స్ యూనిట్'' అని యేర్పడ్డారు. ఈ ఆస్తిక భక్త యువ బృందమంతా అన్నదాన కార్యక్రమములు, చలివేంద్రములు, పేదలకు ఆర్థిక సహాయము, అనేక విపత్తులలో పలు విధాల సేవా కార్యక్రమాలకు అలవాటు పడిన ఈ యూనిటం.

జగజ్జననీ ఆలయ నిర్మాణ సంకల్పం బూనింది. పూనిందీ అంటే పరాశక్తి కల్గించింది.

సేకరించిన స్థలానికి కంచి, శృంగేరీ స్వాముల వారి శుభాశీరనుమతులూ లభించాయి.

తరువాత 3 సం.లకు 1999 జనవరిలో శిలాన్యాసం జరిగింది. అమ్మవారి విగ్రహం 9. ల ఎత్తుది చేయించి తాత్కాలిక పూజలు నిర్వహించే కుటీరం ఏర్పాటు జరిగాక త్రిశరనాగసర్పం ఒక రాత్రి అమ్మవారి విగ్రహానికి ఫణిచ్ఛాయ పట్టిందన్న వింత, నమ్మినా నమ్మకున్న - జరిగిన సత్యం. ఈ అపూర్వ సత్య సంఘటన 1999 జులైలో జరిగింది.

ఆ తరువాత శిల్పులను మాట్లాడడం మొదలుకొని బృహత్ శిలలు తెప్పించటం, మలిపించటం, అగాధంగా పునాదులు, మహత్తర శిల్పాలు, మహోన్నత స్తూపాలు, నిలువెత్తు అధిష్ఠానం, గర్భగుడి, రంగ, ఆస్థాన మంటపాది ప్రణాళికలు, గోపుర నిర్మాణం - తద్బాహ్య దృశ్యమాన సకల దేవతా మూర్తులు - ప్రకృతి ప్రతిబింబ దేవతాకృతులు - తదితర శిల్ప కళా వైభవ సంస్కృతీ ప్రదర్శనం వరకూ.

లక్షల రూపయల వ్యయతో ఏళ్ళ తరబడీ అమ్మవారి ఆలయ నిర్మాణం కొనసాగిస్తుండడం -

అమ్మ భక్తుడు శివనాగపుల్లయ్య, అతని అనుచర బృందం ఎలా సాధిస్తుందనడం -

ఆ జగన్మాతకే ఎరుక!

పలువిధాల యాచనలతో పరమార్థ దృక్పథములో పరమాత్మికాలయ నిర్మాణం సాగించటం శ్రీ దుర్గ ఫ్రెండ్స్ యూనిట్ కు తలకుమించిన భారమే అవుతున్నా అపోహలకు తావివ్వని రీతిలో ఐచ్ఛిక విరాళాలతో - అర్థించే తీరుతో ఈ అపూర్వ నిర్మాణాన్ని సాగించడం ఆశ్చర్యమే.

వానచుక్కకోసం చక్రవాకం, చంద్రకిరణం కోసం చకోరం ఎదురుచూచినట్లు, ఆస్తిక దాతృత్వ వీక్షణావర్షం కోసం ఆలయ నిర్మాతల హృదయలూ నిరీక్షిస్తున్నాయి.

అయినా - క్రియ నెరిగి ఉదారులే ముందుకు రావాలన్న తపన తప్ప - యాచించి అలుసుకావడం ఇష్టంలేని పట్టుదల అమ్మవారిపై నమ్మకం ఈ ఆస్తిక బృందాన్ని ముందుకు నడుపుతూనే వున్నా ఏ భక్త ఆస్తిక ఉదారమహాశయులో సహకరించక పోరా అని ఆశ, అది జరగాలి - విశ్వంలోనే అవూర్వమైన ఈ ఆలయం జగజ్జేగీయమానం కావాలి.