శ్రీమత్ జగజ్జననీ మహాత్మ్యం
''ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యాన కేలికలకంఠీరం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం!''

ఓంకారం అనే ప్రణవ పంజరంలో చిలుకగా, ఉపనిషత్తులు అనే వనంలో క్రీడించే కోకిలగా, వేదములు అనే అడవిలో నర్తించే నెమలిగా సర్వశ్రేష్ఠమైన దేవతాశిరోమణిగా భావింపబడిన 'తల్లి' సాక్షాత్ గౌరీ దేవి!

గౌరవర్ణము కలది - అనగా తెల్లని రంగుతో ప్రకాశించేది కనుకు ఆదిమాతను గౌరి అన్నారు ఆర్యఋషిపుంగవులు. 'తెల్లని రంగు' కాంతి సంకేతం. 'కాంతి-వెలుగు-ప్రకాశం' ఈ పదాలన్నీ తెల్లని మెరుగుకే పర్యాయాలు.

ఆ విధంగా - దుర్నిరీక్ష్యమానం అయిన కాంతి పుంజంతో అలరారే 'శక్తి' ఆ ఆదిపరాశక్తి - ఆ సకల జగజ్జననియే గౌరి !

తరువాత గౌరి 'శివసతి' అయిన 'పార్వతికి' పర్యాయనామంగా ప్రసిద్ధి చెందినా నిజానికి అఖిల భువనాలకూ, సకల లోకాలకూ, అఖిల చరాచర భూత జలానికీ, తల్లిగా అయినది 'జగజ్జననే' ఆ గౌరి! ఆ పరాత్పర సచ్చిదానంద మూర్తి, జ్ఞానభక్తి నైవేద్యో పహార త్రిమూర్తి త్రిశక్తి త్రిగుణాది త్రయివిషయ సృష్టికి మూలకర్ర్తి అయిన ఆ జగజ్జనని గురించి దికిమాత్ర ప్రవచనమే ఈ క్రించిద్రచనము.