శ్రీ జగజ్జననీ దీక్ష
ఈ విశ్వం ఆవిర్భవించిందీ? అన్నది నేటికీ సరైన సంతృప్తికరమైన సమాధానం దొరకని వేల వరహాల ప్రశ్న

''సైన్సు'' ప్రతిపాదనలలోనే భిన్నవాదాలున్నాయి. 'బిగ్ బ్యాంగ్' థియరీ మొదలు నేటి ''బ్లాక్ హోల్'' రహస్యాల థియరీ కానీ - ప్రపపంచములోనే అత్యంత ప్రాచీనమైన ''భారతీయ ఆర్షఖగోళ సిద్ధాంత ప్రకారము'', పురాణమహర్షి ప్రోక్త వేదాంత విచారం ప్రకారమున్నూ ఈ సకల చరాచర సృష్టికి, ఈ సమస్త భువన సృజనకూ ఒక ''ఆది పరాశక్తి'' దృక్శక్తియే కారణమనీ, ఆ ఆదిపరాశక్తి ఆజ్ఞననుసరించి తదనంతర శక్తులూ ఆది జన్యువులూ ఉద్భవించి, తద్వారా ఈ సమస్త చరాచర జీవజాలమూ, విశ్వసృష్టీ జరిగిందనీ ఇది స్థిర సిద్ధాంత మనీ నిర్ధారితమవుతున్న కథనం.

భారతీయ వైదిక, ఆధ్యాత్మిక, పౌరాణికేతిహాస, వేదాంత విషయ చర్చాపరంగా ఈ సిద్ధాంత సమైకయవాదనలో విప్రతిపత్తీ విభేదాలూలేవు.

తదనంతర కాలంలో ''ఆచరణీయ ధర్మమార్గాన్ని'' అనుసరించి శైవవైష్ణవాది మతపర సిద్ధాంతాలు అనేకం విభేదించినా, సృష్టి, సిద్ధాంత విషయములో అవన్నీనూ ఈ ఆదిపరాశక్తి మూలకారణ సిద్ధాంతాన్ని త్రోసిరాజనకపోవటం గమనార్హం.

చివరకు బౌద్ధగినజైన అగ్నిమత ప్రాతిపదిక కథనాలలోనూ, బుద్ధ, జిన, అగ్ని పరంగా, సృష్టి మూలకారణ శక్తిని నిర్దేశించినా ఆది శక్తియే కావటం సృష్టి జనన కథనం ఆర్షగ్రంథకథనాన్నే పోలివుండడం గమనార్హం.

అంతే కాదు - ఈ సృష్టిమూలకథకు ఆధారమవుతున్న ఆదిపరాశక్తి గురించి లౌకికంగా ఒక విషయాన్ని గమనింపవలసివుంది.

ఒక జీవి కదలికకు, చేతనకు, జీవయాత్రకు ''శక్తి'' అవసరం.

ఆదినాలలో రథ గజహయ పదాతి బలాలు కదిలాయన్నాపలు విధాలయిన ఆయుధాలతో యుద్ధాలు చేశారన్నా ''శక్తి''యే కావలసివచ్చింది.

ఈనాడు యాంత్రికమైన అనేక వాహనాల కదలికకూ, అధునాతన యుద్ధపరికరాల ప్రయోగాలకు కూడా ''శక్తి''యే కావలసివస్తుంది.

ఈ శక్తి ఆ దినాలలో 'మాంత్రికమైనది' ఇదీ సూర్య, వాయు, అగ్ని, జల ప్రకృతి, భూ, శక్తులుగాను, ఈ దినాలలో చోదన ప్రేరణ, ఘర్షణ, విస్ఫోటన, ఆవిరి, విద్యుత్, శక్తుల రూపాలలోనూ, 'యాంత్రికమైనది'గా విస్తరించే వుంది.

ప్రతి జీవికీ, ప్రతి పనికీ, 'శక్తి' మూలం - అని గ్రహించిన వేల సంవత్సరాల నాటి మహర్షులు ఈ 'సర్వ శక్తికీ' సకల సృష్టికీ ఒక మూలశక్తి యేదో ఆధారభూతమైవుందని గ్రహించగలిగారు - ఇది మేథో శక్తి - శక్తియే యిక్కడా. వారు తొలుత ఆ శక్తిని సత్తుగా స్వీకరించారు. చిత్శక్తిగా భావించారు. ఆదిపరాశక్తి అది, అదృశ్యం అనిర్వ్యాచ్యం, అవిచ్ఛేద్యం, అమోఘం, అనంతం, దుర్భేద్యం, దుర్ర్గాహ్యం, అని తెలుసుకోగలిగి ఆ ఆదిపరాశక్తికే 'జగన్మాత - జగజ్జననీ - జగత్పరాత్పరి' అని ఉల్లేఖించినారు.

ఆ ఆదిపరాశక్తి - తన శక్తిని తొట్టతొలత త్రిథా - అంటే మూడు అతిముఖ్య రూపాలుగా - పార్వతి, లక్ష్మి, సరస్వతిగా సృజించి, (అప్పటికి ఈ పేర్లేవీ లేవన్న విషయాన్ని గమనించాలి. ఇవి తదనందలరము వేల సంవత్సరాల వ్యవధిలో పౌరాణికంగా ఏర్పడిన పేర్లు మాత్రమే)

వీటికి ఆలంబనంగా రజ స్సత్త్వతమోగుణాలను సృజించి, ఈ గుణత్రయానికి ఆలంబనగా మూడు రూపాలను సృజించి (తదనంతర కాలములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర నామాలుగా ప్రఖ్యాతమిది) ఆ ఆది జంటల ద్వారా అనంతర విశ్వ సృజనకు 'మార్గం సుగమం' చేసింది.

తర్వాత వెలసిన అనేకానేకం శక్తి స్వరూపాలకు, పేర్లకూ మూలశక్తి, మూలమాతా ఈ 'ఆది పరాశక్తి'యే.
ఈమే సకల జగాలకూ భువనాలకూ సమస్త సృష్టికీ ఆదిమాత కావటం వలన ఈమె జగజ్జననిగా ప్రసిద్ధి చెందింది.

'జగన్మాత', ఆదిమాత, శ్రీమాత, పార్వతీమాత, సంతోషీ మాత ఇత్యాదిమాత పేర్లూ ఆ పేర్లతోవున్న ఆలయాలు అన్నీ పార్వతి ప్రతిరూపాలన్న విషయం గమనించాల్సివుంది.

కానీ నిరంతర నిర్మోహ నిర్మాణ సంచారులైన కొందరు యోగులకు, సిద్ధులకు హిమాలయాలలో దర్శనమిచ్చిన 'శక్తి స్వరూపం' ఈ 'జగజ్జనని'.

ఆ పరాత్పరికి ఎన్ని శక్తుల పేర ఆలయాలున్నా 'జగజ్జనని' పేర ఈ విశ్వంలో ఒక్క హిమాలయాలలో తప్ప ఎక్కడా ఆలయం లేదు. ఈ నంద్యాలలో ఇది రెండవది అంతే.

పురాణేతిహాసకాలం నుండీ కూడా క్రతురక్షణ నిమిత్తమో ఒక యజ్ఞ నిర్వహణ నిమిత్తమో, ఒక ధర్మ సాధనా వసరం కోసమో, ఒక న్యాయ విజయం కోసమో, ఒక జాతి పరిరక్షణ నిమిత్తమో, ఒక కార్యసాధన కోసమో 'శక్తి దీక్ష' బూనే ఆచారం అత్యంత ప్రాచీన కాలం నుండీ వుంది. కాకపోతే - పలు విధాలుగా, పలు పేర్లతో ఇది ఆనాడు పిలువబడింది.

ఒక ప్రాచీన ఋషి తపస్సుకు పూనుకున్నాడు. అసలు తపస్సు, దానికి పూనుకోవడములోనే ఈ శక్తి దీక్ష దాక్కొని వుందన్న రహస్యం మరువరాదు.

ఒక 'సాధన' కోసం (సాధనా శక్తి) తపస్సు (ఇదీ శక్తే) అనే దీక్ష బూనటం శక్తి ద్వారా శక్తి కోసం శక్తితో దీక్ష వహించటం.

అలాగే మునులు, ఋషులు, రాజులు, రాక్షసేంద్రులు, తపోదీక్షబూనటం 'శక్తి దీక్ష' నాటి ప్రథమరూపాలు.

తదనంతరకాలంలో మాతల అనుజ్ఞ ఆశీరాకాంక్షలతో రక్షరేఖతో కార్యసాధన కోసం 'దీక్ష' వహించటం.

ఆ తదుపరి మనకు 'సురాసుర సంగ్రామ కథలు' వైనతేయుని కథ సున్నిపిండితో హైమవతి బాలుని చేసి ప్రాణం పోసి కావలిపెట్టిన కథ షణ్ముఖుని సంచార కథ ఇత్యాదులనేకం పరిణామ రూప శక్తి దీక్షలకే సంకేతాలుగా కనిపిస్తాయి.

మానవుని ప్రతి కార్యసాధన వెనక ప్రస్ఫుటంగా కనిపించేది ఈ 'శక్తి దీక్ష'యే.

ఆ శక్తి మరెవరోకాదు. ఆ జగజ్జననియే.

'అయ్యప్ప, శివ, నారసింహ, భవాని' ఇత్యాది దీక్షలన్నీ ఈ 'ఆదిమకాలము శక్తి దీక్ష, ననుసరించి తదనంతరకాలంలో ఆవిర్భవించిన అర్వాచీన దీక్షలే (క్రొత్త దీక్షలే)

కనుకే ఆ 'ఆదిపరాశక్తి అయిన' శ్రీ జగజ్జననీ దీక్ష - నవరాత్రులలో ధరించటం ఎవరికైనా అత్యంత శ్రేయోదాయకం 'జగజ్జననీ దీక్ష' అంటో ఆదిమకాలం నుండీ వున్న ప్రప్రథమ శక్తి దీక్ష నాచరించి ప్రాచీనాచారాన్ని గౌరవించినట్లే.