శ్రీ చక్ర ప్రదక్షిణం - ఫలితం
భారతీయ యోగవిద్యలో అత్యంత ప్రాచీనమైనది బిందుప్రయోగం. 'నాసికా, లంబికా, భ్రూ లగ్న వీక్షణ సిద్ధి'లో ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ బిందుప్రయోగం.

జీవాత్మను పరమాత్మతో లీనం చేసేందుకు తోడ్పడే, సాధించే అభ్యాసంలో అన్ని యోగాలకూ తలమానికం ఈ బిందు ప్రయోగమే.

దీనితో ముడిపడివున్న ప్రాచీనాచార ప్రదక్షిణమే ఈ శ్రీ చక్ర ప్రదక్షిణం.

వేల సంవత్సరాలుగా ''శ్రీ చక్ర స్థాపనం - శ్రీ చక్ర మంత్రం - జప విధానం''లో ప్రధానాంగం బిందువుదే.

''బిందు త్రికోణ సంయుక్తం'' అంటూ శ్రీ చక్రజప మంత్రంలోని రహస్యం ఇదే. ఇది చాలా గహనమైన మంత్రరాజం.

ఈ మంత్రాదికాన్ని ప్రక్కన బెడితే - దీక్షాధారి తన నిత్యధ్యాన కేంద్రం (బిందువు) నుండి కొన్ని నియమిత మార్గాల గుండా ఒక ప్రదక్షిణావర్తం పూర్తి చేసినప్పుడు అది యాదృచ్ఛికంగా - శ్రీ చక్రాంతస్థితానేక త్రికోణాకృతులతో ఏ ఒక్కటిగా కుదిరినా దానినే శ్రీ చక్ర ప్రదక్షిణ అంటారు.

అటువంటి అద్భుత సంవిధానం జగజ్జననీ దీక్షాధారుల నగర ప్రదక్షిణలో చోటు చేసుకోవటం అమ్మవారి కృపగాక! అందరూ తదనుగ్రహ ప్రాప్తులగుదురుగాక!

కోణశిఖర కేంద్రం శ్రీ జగజ్జననీ ఆలయం కాగా అక్కడి నుండి దక్షీణావర్తంగా సోమనందీశ్వరుని, మల్లికార్జునుని, నాగనందీశ్వరుని, ఆంజనేయస్వామిని, కాళికాంబను, మహానందీశ్వరునీ దర్శిస్తూ తిరిగి జగజ్జనని సన్నిధికి చేరి అక్కడ ప్రదక్షిణం గావించి అమ్మవారికి నమస్సులు చెల్లస్తే -

ఇది యాదృచ్ఛికంగానే అయినా అమ్మవారు అష్టభుజ కావున ఈ ప్రదక్షిణము అష్టభుజి - పంచకోణ నియమావృత శ్రీ చక్ర ప్రదక్షిణంగా రూపొంది - భక్తులకు అనైచ్ఛిక పుణ్యసంప్రాప్తి అతార్కికంగానే కల్గిస్తున్నది.

అష్టభుజగా - 8 దేవతామూర్తుల దర్శనం

పంచకోశ, తన్మాత్ర ప్రాణ, వాయు, భూత సంకేతంగా పంచ కోణములు వెరసి శ్రీ చక్రాంతస్థిత ప్రధాన పంచకోణ సమాహారం అత్యద్భుత ప్రదక్షిణా ఫలదం - ఈ చక్ర వర్తనం.

(కోణముల భుజములు కాదిక్కడ. బిందుస్థానాలు - దేవతా మూర్తుల ఆవాసాలు ఇవే భుజాలు)