శ్రీ జగజ్జననీ స్వరూపం గురించి
ఓంకారేశ్వరి! నాదబిందుకలితే! దివ్యప్రభాకారిణి!
సౌమ్యే! ఆననరౌద్రరూపచలితే! గంభీర శస్ర్తాన్వితే!
పీఠేసింహమురారిశాయన కృతే! పార్శ్వే విరించిస్థితే!
కుక్ష్యాం పంచముఖప్రకాశితశివే! కామ్యార్థసంధాయిని!
వందే! హే జగదంబికే! తవపదౌ దాస్యామి దేహంమమ !

అష్టాదశపురాణాలూ, భాగవత, దేవీభాగవత గ్రంథాలూ, కొన్ని ఉపపురాణాలు ఈ సకల చతుర్దశ భువనాల సృష్టి గురించీ విశదంగా వివరించే వున్నాయి.

పురాణాలన్నీ ఈ చరాచర జీవరాశి సృష్టికి ముందు ప్రకృతి అంతా జలమయంగా వుండిందనే చెప్పాయి.

ప్రకృతిని, ప్రకృతిలో అలముకొని ఆవరించువున్న ఆ నీటిలో నుండి - నామరహిత స్థితి నుండి 'స్వయంభువు' గా (తనంత తాను పుట్టిన వాడుగా) బ్రహ్మ జన్మించాడని ''బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త పురాణాలూ; విష్ణువు స్వయంభువుగా ఆవిర్భవించి 'సృష్టికర్తను' సృజించి, తదుపరి సృష్టి గావించుమని ఆదేశించాడని విష్ణు, వరాహ, వామన, భాగవత, నారద పురాణాలు''; శివుడు స్వయంభూలింగాకారుడై జనించి తదుపరి సృష్టికి బ్రహ్మ విష్ణ్వాది దేవతల సృజించాడని ''శివ, లింగ, స్కంద పురాణాదులు'' వివరిస్తున్నాయి.

''ఆదిపరాశక్తి'' సకల చరాచర సృష్టికీ ఆదిమాతగా ఆవిర్భవించిందని ''దేవీభాగవత పురాణాదులు'' వివరిస్తాయి.

నిశితంగా పరిశీలిస్తే ఆవరించిన నీటి నుండి సమస్త విశ్వసృష్టీ ఆవిర్భవించాలీ, ఆవిష్కరింపబడాలీ అంటే 'ఒక మహత్తర శక్తి' అవసరం.

ఆ శక్తి మొట్టమొదట ఒక దివ్య కాంతిపుంజంగా జలప్రళయోపరి జన్మించి సత్త్వరజస్తమోగుణాల పుట్టుకకు మూలకారణమయ్యింది. మూడు గుణాలకు మూడు రూపాలు ఏర్పడితే అవి బ్రహ్మ; విష్ణు; శివాఖ్యలతో ప్రఖ్యాతమయ్యాయి.

త్రిగుణాలతో ఆకృతులయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ సకల చరాచర జీవకోటి సృష్టి స్థితి లయాలకు మూలకర్తలయిన త్రిమూర్తులుగా విలసిల్లినారు.

ఈ త్రిమూర్తుల జననానికీ, త్రిగుణాల ఆవిర్భావానికీ మూలమైన దివ్యజ్యోతిః పుంజమైన ఆ ''ఆదిశక్తి'' యేదో - అదే ''సమస్త శక్తికీ మూలరూపమైన జగజ్జనని'' అని శాక్తేయుల ఉవాచ.

ఆలోచిస్తే అన్నిటికీ 'శక్తి' మూలం కనుక ఈ 'జగజ్జనననీ నిర్ణయవాదం' సమంజసమైన అనిపిస్తుంది.

అయితే సహస్రాబ్దాలుగా ఈ జగజ్జనని ఆకారమెట్టిదనిన ప్రశ్నకు సరైన సమాధానస్వరూపం ఎక్కడా లభ్యం - సాధ్యం కాలేదు.

శక్తి ప్రధానేతివృత్తమయిన పురాణ కావ్యేతిహాసాలలో కానీ, అనేకానేక ప్రాచీన శక్త్యారాధనా విధాన బోధకములయిన తంత్ర మంత్ర గ్రంథములలో కానీ ఆ పరాశక్తి 'కాళీ, చండికా, శాంభవి, మహిషమర్తని' ఇత్యాది రూపాలతోనే వర్ణింపబడినదే తప్ప ఆమే అపూర్వ శక్తికి నిదర్శనమైన ఆకృతిగానీ వర్ణనగానీ లభింపలేదు.

భారతీయుల భాగ్యవశాన ఎవరో ఒక మహా యోగి హిమాలయాలలో సంచరిస్తూండగా ఆ సుందర దవళ హిమార్చిత కోణకందరాలలో ఒకచోట ప్రాచీన శక్తి శిల్పమూర్తి సాక్షాత్కరించింది. దాని చిత్రరూపాన్ని తదనంతర యోగిశిష్యులు పరంపరయా అందికొని, దాన్ని ఛాయాచిత్రంగా మలచి, 'జగజ్జననీ నామకరణం' గావించి ఆమే జగజ్జనని అనేందుకు తగిన అర్హతామూర్తి అందున్నదని అనుగ్రహించినారు.

అటువంటి అపూర్వమైన ఆ జగజ్జనని శిలావిగ్రహం దేశ మకుటమైన కాశ్మీరు ప్రాంత హిమాలయాలలో వుంటే -

ద్వితీయ విగ్రహం ఇప్పుడు దక్షిణ భారతంలో, ఆంధ్రదేశంలో, రాయలసీమలో, కర్నూలు జిల్లాలో, నవనందులకు ఆలవాలమైన నంది మండల దివ్యక్షేత్రంగా పేరు గాంచిన ''నంద్యాల'' పట్టణంలో, అప్రయత్న పూర్వకంగా, అయాచితలబ్ధంగా పట్టణ ప్రజల క్షేమస్థేమ విజయాభ్యుదయ ఆయురారోగ్య భాగ్యదాయకంగా ఆగమ శిల్ప వాస్తుకనుగుణంగా ఈశాన్య దిగ్భాగంలో ప్రతిష్టింపబడినది. ఇది ఆనందదాయకమైన విషయము. నంద్యాల ప్రజలకు, అఖిలాంధ్ర జనులకు గర్వకారణమైన విషయం.

త్రిమూర్తులకన్నా, త్రిగుణాలకన్నా అతీతమైన దివ్యశక్తిగా మూర్తీభవించిన ఆ జగజ్జనని మహిమ వర్ణణాతీతం కూడా.

శ్రీమత్ జగజ్జనని ఆదిమధ్యాంత రహిత, అనంత దివ్యకాంతి సహిత, యోగులకు ఆ ఆదిపరాశక్తి నిరాకార నిరంజన నిర్గుణ నిరామయ నిరంతర నితాంతానంత పరబ్రహ్మ స్వరూపం.

అర్చావతారార్చకులకు సాకార సానంద సగుణ సచ్చిదానంద సదాసత్యస్వరూపం. భవసౌఖ్యదాయినీ, భవబంధమోచనీ ఆ పరాశక్తియే. ఐహిక బంధ సంబంధానికీ ఆముష్మిక మార్గ నిర్దేశానికీ కరదీపిక ఆమే.

ఇంద్రియ వాంఛావరసిద్ధికీ జితేంద్రియ శక్తి ప్రసాదానికీ అనుగ్రహ జ్యోతీ ఆమే.

ఈ సకల చరాచర సృష్టి నిమిత్తం హరిహర బ్రహ్మలను సృష్టించిన అనంత శక్తి జగజ్జనని.

దర్పదానవసంకేతమయిన సింహాన్ని వాహనంగా చేసుకొని, సకల భువనసృష్టి స్థితి కారకుడయిన విష్ణువును తన పాదపీఠశాయిగా చేసికొని ప్రజాపతుల సృష్టించి వారి ద్వారా విశ్వసంచార క్రియను సుగమం చేసిన బ్రహ్మను తన ప్రక్కనే వుంచుకొని, పంచభూతాలను, పంచప్రాణాలను, పంచన్మాత్రలనూ తన ఆధీనంలో వుంచుకొని, సర్వ జగన్మహాప్రళయకాలంలో పంచభూతాలనూ సమసింపజేస్తానని తెలిపే విధంగా పంచముఖాలతో వెలసిన శివుని తన కడుపులోనే నిలిపి త్రిమూర్తులూ వారి సతులూ తమ తమ కార్యకలాపాలను జగజ్జనని వీక్షానుమతితోనే సాగిస్తారిని ప్రపంచానికి తెలిపే ఆదిమశక్తి ఈ జగజ్జనని.

అనేక యుగాలలో అసురశక్తులు విజృంభించినప్పుడు దుర్గగా, చండిగా, మహామాయగా, యోగశక్తిగా, కుండలినిగా, శాంభవిగా, శంకరిగా, కాళిగా, మహిషమర్దనిగా, కనకదుర్గగా, భ్రమరాంబికగా, అన్నపూర్ణగా పలు అవతారాలెత్తి దుష్టదానవ వినాశం గావించిన మహాశక్తి జగజ్జననియే.

సుందోపసుందులను, శుంభనిశుంభులను, రక్తబీజ, మహిషాసురలను, దానవేంద్ర పరికల్పిత మహామాయలను సంహరించి విశ్వశాంతి హవనం గావించిన అపూర్వ మహిమాన్విత దివ్యశక్తి జగజ్జనని.

అష్టాదశ శక్తి పీఠాలలో అనేక నామములతో సాక్షాత్కరించేదీ, సప్తమాతృకామూర్తిగా ప్రకాశించేదీ, వేల గ్రామాలలో గ్రామదేవతగా ప్రత్యక్షమయ్యేదీ జగజ్జననియే.

విశాలాక్షి, మీనాక్షి, కామాక్షి, కాళికాంబ, చాముండేశ్వరి, చౌడేశ్వరి, ఇత్యాదిగా వెలసినా, పోలేరమ్మ, సుంకులమ్మ, నూకాలమ్మ, గంగానమ్మ, జంబులమ్మ ఇత్యాదిగా గ్రామదేవతలుగా విరాజిల్లినా అన్నీ జగజ్జననీ స్వరూపలే.

సమస్త 'మహిళా మూర్తులా' ఆ జగజ్జననీ స్వరూపమే అన్నా ఆశ్చర్య పడవలసిన పని లేదు. అందుకే ''యత్ర నార్యస్తు పూజ్యంతే తిష్ఠంతి తత్ర దేవతాః'' అన్నారు.

సకల జీవరాశికీ చైతన్యాన్ని ప్రసాదించే సూర్యునిలో మండే వెలుగుల మూల శక్తీ, సకల ఔషధీ ప్రస్తరుడైన చంద్రునిలో విరాజిల్లే శీతల కిరణాల ఆధారశక్తీ, త్రేతాగ్ని రూపంలో మానవ ప్రయోజన కారిగా మండే అగ్నిలోని అనంత దహన శక్తీ ఆ జగజ్జనని స్వరూపాలే.

ఉరుము ఉరిమితే జనించే బడబాగ్నికి ఎవరిచ్చారీ శక్తి! పాపాలు శమింప జేసే శమీ వృక్ష గర్భంలోని అగ్నికీ ఎవరిచ్చారు అద్భుతమైన శక్తి! మహా మహిమాన్వితమైన మంత్రాక్షరాలలో శక్తి ఎవరు! గాయత్రీ ఛందశ్శక్తి, మంత్ర శక్తి ఎవరు! జపం తపం హోమం యజనం .. .. .. వీటి వల్ల లభించే శక్తికి ఆకరం ఎవరు!

వాయువులో వేగం, భూమిలో సహనం, సాగరంలో కల్లోలం, పర్వతాలలో చలనం, ఆకాశంలో అనంతం ఎవరందించిన శక్తులు!

శబ్దంలో, సంగీతంలో, కలకలంలో, సంఘీ భావంలో, సమ్యగాలోచనలో, శక్తి ఎవరు!

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే - ఆ శక్తి జగజ్జనని విభిన్నరూపాలని, శక్తి కావాలి అన్నింటికీ -

గ్రహచలనానికీ, భూభ్రమణానికీ, నదీ తరణానికీ, పర్వతవర్థనానికీ, సాగరతరంగ ఘోషకీ, పాతాళ ప్రకంపనాలకీ, భేతాళ విన్యాసాలకీ, రాజ్య పాలనకీ, రాజరిక రక్షణకూ, మనిషి జీవనానికీ, మనోధావనానికీ .. .. .. అన్నింటికీ .. .. .. ఒక్కటనేమి ? అన్నింటకీ కావాలి శక్తి!

ఆ శక్తి .. .. .. మరేదో కాదు .. .. జగజ్జనని విభిన్నరూపాంతరక్రమమే!

ఆ జగజ్జనని లేనినాడు శక్తి లేదు,

సృష్టిలేదు సృష్టి లేని నాడు విశ్వమే శూన్యం !

విశ్వచలనానికి వూతం జగజ్జనని ! విశ్వశాంతికి గీతం జగజ్జనని !

అంతా జగజ్జనని ! అన్నీ జగజ్జనని !
ఆ జగజ్జననీ కృపాకటాక్ష వీక్షణాలబ్ధికోసం దీక్షబూని భక్త జనులందరూ కఠోర నియమానుష్ఠాన పరాయణులై జగజ్జననిని సేవించటం, భవసాగరం తరించడమే!

హే జగన్మాత ! దుర్గ ! మహేశ్వరి ! మహి
షాసురాంతకి ! శాంభవీ ! షణ్మఖాంబ !
కాళికామాయి ! వరదాయి ! కష్టదుష్ట
దానవధ్వంసినీ ! జగద్రక్ష రక్ష!
నవనంది నిలయమై నంద్యాలగా పేర్గాంచిన మన నంద్యాల పట్టణంలో కోట వీధిలో భక్తజనావళి హృదయ సింహాసనాసీనయై వెలిగేలా పట్టణం ఈశాన్య దిగ్భాగంలో, నవనందీశిలలో ఒకడైన శ్రీ సోమ నందీశ్వరుని సమీపంలో శ్రీ జగజ్జననీ ఆలయ నిర్మాణం జరగడం పట్టణానికీ, పట్టణ ప్రజలకూ సకల సమయ జగద్రక్ష! ఆరక్షాకృతి సమస్త సృష్టి స్థితి లయకారిణి శ్రీమజ్జగజ్జనని !

ఆ జగజ్జననీ సుందర దేవాలయ నిర్మాణ యజ్ఞ నిర్వహణం ఆ త్రిజగద్రక్షా స్వరూపిణి శ్రీమత్ జగజ్జననీ దివ్యమంగళ స్వరూప ప్రతిష్ఠా మహాయజ్ఞం భక్తాగ్రగణ్యుల అందరి యధాశక్తి విరాళ మరాళ గమనంలోనే సుసాధితవ్యం!

భక్త జనులందరూ త్రికరణ శుద్ధి ప్రదానం చేసి ఆ శ్రీ జగజ్జననీ కరుణాకృపాకటాక్షమల మాలాధారులగురు గాక!